హైదరాబాద్:
తెలంగాణకు గోదావరి జలాల (Godavari Water) వినియోగంపై బిఆర్ఎస్ (BRS) నాయకులు చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. బిఆర్ఎస్ నేతల ఆరోపణలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
నీటిమట్టం లేకపోవడమే కారణం
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసే అంశంపై ఎంపీ స్పందిస్తూ.. ప్రాజెక్టు ద్వారా నీటిని పంపింగ్ చేయాలంటే కనీసం 93.5 మీటర్ల నీటిమట్టం ఉండాల్సి ఉంటుందని వివరించారు. కానీ ప్రస్తుతం అక్కడ కేవలం 89 మీటర్ల ప్రవాహం మాత్రమే ఉందని, ఈ పరిస్థితి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద కూడా ఉందన్నారు. నీటిమట్టం సరిపడా లేకపోవడం వల్లే పంపింగ్ సాధ్యపడటం లేదనే విషయాన్ని దాచిపెట్టి బిఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు.
కృష్ణా జలాల్లో నష్టం చేసింది బిఆర్ఎస్సే!
అలాగే కృష్ణా జలాల వివాదంపై మాట్లాడిన ఎంపీ, నాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వమే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను కేవలం 299 టీఎంసీలకు పరిమితం చేసే ఒప్పందానికి అంగీకరించి రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని ఆరోపించారు. పదేళ్ల పాటు పాలనలో ఉండి రాష్ట్రాన్ని ముంచిన నేతలు, ఇప్పుడు గోదావరి జలాలపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని సమర్థంగా ఎత్తిపోస్తూ రైతులకు అందిస్తున్నామని స్పష్టం చేశారు. కేటీఆర్, హరీశ్‌రావులు వాస్తవాలను పక్కనపెట్టి కేవలం రాజకీయ లబ్ధి కోసమే విమర్శలు చేస్తున్నారన్నారు.
అఖిలపక్ష సమావేశానికి పిలుపు
ఎల్‌నినో ప్రభావం వల్ల ఏర్పడే ఎలాంటి కరువు పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని ఎంపీ వెల్లడించారు. ఈ నెల 28న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నీటి పారుదల అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరై నిర్మాణాత్మక సూచనలు మరియు సలహాలు ఇవ్వాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు.
